BJP Jagtial: బీజేపీలో చేరిన జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్.. కన్నీళ్లు పెట్టుకుని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చా..

ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో బుధవారం ఆమె బీజేపీలో చేరారు. సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాతో శ్రావణి మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.

BJP Jagtial: బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులతో జనవరి 25న ఆ పార్టీకి, మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన డా.శ్రావణి తాజాగా బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో బుధవారం ఆమె బీజేపీలో చేరారు.

సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాతో శ్రావణి మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు బీజేపీ పోరాడుతుంది. డా.శ్రావణిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నా. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో అభివృద్ధి అనేదే లేదు. అవినీతే ఉంది. శ్రావణిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధించారు. రెండేళ్ల పదవీకాలం ఉండి కూడా ఆమె పదవికి రాజీనామా చేశారు. శ్రావణి బీజేపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం’’ అన్నారు.

ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ ‘‘బీఆర్ఎస్‌లో కింది స్థాయి నేతలు వేధింపులకు, అణిచివేతకు గురవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మున్సిపల్ చైర్మన్‌లు, సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్‌లో కింది స్థాయి నేతలకు గౌరవం లేదు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి స్థానిక సంస్థల నిధులు దోచుకుంటున్నారు. అందుకే ఆమె బీఆర్ఎస్‌‌లో ఉండలేక మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు బీజేపీలో చేరారు. బీజేపీలోకి స్వాగతిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.

డా.శ్రావణి మాట్లాడుతూ ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను అణిచివేశారు. కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చినా, బిఆర్ఎస్ అధిష్టానం నన్ను ఓదార్చలేదు. ఆత్మాభిమానంతో బిఆర్ఎస్ నుంచి బయటికి వచ్చా. జగిత్యాలలో బీజేపీ అభివృద్ధికి పని చేస్తా. బీజేపీలో సైనికురాలిగా పనిచేస్తా. హామీలు నాకు అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.