
వారం రోజుల నుంచి ఒకటే మోత. పొద్దున లేచింది మొదలు మళ్లీ తెల్లారే వరకు రికం లేకుండ ఒకటే వార్త. తమిళనాడులో అదయింది. తమిళనాడులో ఇదయింది.. అమ్మ ఆత్మ గోసించింది.. పన్నీరు జల్లైంది శశికళ కన్నీరై పారింది ఇదే వార్తలు పాడిందే పాడురా పాసు పళ్ల దాసు అన్నట్టు తెలుగు మీడియా అంతా అరవగోలను నెత్తికి ఎత్తుకుంది. కొన్ని ఛానల్లయితే టీఆర్పీ రేటింగ్ ల కోసం ముగ్గురు నలుగురు సీనియర్ జర్నలిస్ట్ లను రెండు రెండు ఓబీ లైవ్ వ్యాన్లు ఇచ్చి మరీ తమిళనాడుకు పంపింది. కనీసం బ్రేక్ టైం లో కూడా తెలుగు వార్తలకు తెలంగాణ, ఆంధ్రాల్లోని సమస్యలకు చొటు ఇవ్వకుండా ఎక్కి దిగింది. మొత్తానికి తమిళ వాసనను తెలుగు ప్రజలకు రంజుగా పట్టించింది.
మరీ ఈ వార్తలతో ఇటు తెలంగాణ ప్రజలకు అటు ఆంధ్ర ప్రజలకు ఏమన్నా లాభం ఉందా అంటే దమ్మిడి కొత్త కూడా లాభం లేదు. ఒకనొక దశలో తమిళనాడు మీడియా కూడా ఎందుకు పనికి రాదన్నట్టుగా వార్తలను, బిగ్ బ్రేకింగ్ లను, బ్రేకింగ్ లను ఫ్లే చేసి ఇది తెలుగు మీడియా పరిస్థితి అనేలా చేసింది. మొత్తానికి శశి కటాకటాల పాలయిన ఆపని మన వార్తల వర్షం తమిళనాడుకు పళవస్వామి అనే మనకసలే తెలియని ఓ నాయకున్ని సీఎం పీఠం కూర్చోబెట్టి ఎండ్ కార్డును దగ్గరుండి వేయించింది. మొత్తానికి అరవ పంచాయితిని సద్దుమణిగేలా చేసింది. చాలా ఇంకా పక్క రాష్ట్రాల గోల ఏమన్నా ఉందా తెలుగు మీడియా ఉద్దండులు.
పన్నీరు సెల్వం… పళని స్వామి… సెంగొట్టియన్… పాండ్యన్… నోర్లు తిరగని పేర్లను ఈ వారం రోజుల్లో తెలుగు ప్రజలకు సొంతం అన్నంత దగ్గరగా వినిపించింది మన తెలుగు మీడియా. ఈ విషయంలో మీకు మొక్కాలి. గడచిని పది రోజులుగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయి ఒక్క తమిళనాడులో మాత్రమే జనజీవనం సాగుతున్నట్లు, భారత దేశంలో అసలు ఎక్కడ ఏ సమస్యే లేనట్లు.. రాజకీయాలంటే తమిళనాడులో మాత్రమే అంటు వార్తలను బాగానే వండి వడ్డించింది. మరీ ఈ వార్తలు ఎవరికన్న అక్కరకు వచ్చాయ అంటే అది లేదు. కానీ వండటం మాత్రం ఆపలేదు.. మసాలాలు దట్టించి దట్టించి మరీ వండి వార్చాయి. ఇరవై నాలుగు గంటలు తమిళనాడులో చీమ చిటుక్కుమన్నా ప్రపంచానికి తెలియజెప్పాలన్న అర్ధం పర్ధం లేని ఆత్రుత ప్రదర్శించింది. ఆ రాజకీయ టర్బోలెన్స్ ఏదో మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతోందేమో అన్న మానసిక స్ధితిలోకి వీక్షకులను తీసుకువెళ్లిపోయేటట్లుగా ఊపిరి సలపని అరవ వార్తలను ప్రసారం చేసి అవసరం లేని అత్యుత్సాహం ప్రదర్శించింది.
అయితే ఈ అత్యుత్సాహోంలో అసలు రాష్ట్రంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత తెలుగు మీడియా ఇవ్వలేదు. అమరావతిలో మూడు రోజుల పాటు జరిగిన జాతీయ మహిళా సదస్సు అటకెక్కింది. ఇక దేశానికే గర్వకారణంగా ఇస్రో సాధించిన ఘన విజయాన్ని తెలుగు ప్రేక్షకులకు చెప్పడంలో కూడా తెలుగు మీడియా భారీగా విఫలమైంది. అరగంట ప్రత్యక్ష ప్రసారాన్ని టెలికాస్ట్ చేసి ఇది మన వార్త కాదు అన్నట్టుగా దులిపేసుకుని ఎందుకు పనికి రాదన్నట్టు తమిళ వాసనకు వెళ్లిపోయింది. తెలుగు మీడియా దృష్టిలో ఇస్రో సాధించింది చిన్న విజయం గా మారిపోయింది. ఇది మన దౌర్బాగ్యం. ఇది మనం మన వార్తలకు ఇచ్చిన ప్రత్యేకత. ఓ వైపు ప్రపంచమంతా తెలుగు నేల వైపు చూస్తే మన మీడియా మాత్రం అరవనేలపై పరుగులు తీసింది. 104 ఉప గ్రహాలను విజయవంతంగా నింగికి చేర్చి దేశం మీసం తిప్పిన సతీష్ దావన్ అంతరిక్షం కేంద్రం పై ఒక్కటంటే ఒక్క వార్తకూడా ప్రసారం చేసే తీరిక లేదంటే మన వాళ్ల జర్నలిజం విలువ ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఇలా 24 గంటలు జయమ్మ, శశికళ, పన్నీరుల జపం చేసిన మన తెలుగు మీడియాకు అరవ శతకోటి వందనాలు. ఇకనైనా ఆ పిచ్చినుండి బయటకి రండి. మన సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిని చూపించే ప్రయత్నం చేయండి.
























