
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు పడుతున్న ఇబ్బందులను మీ జీవిత గాథను ఓ అద్భుతమైన కథగా రాస్తే సరి. ఆ కథ జనానికి నచ్చి.. మీ బాధను అర్థం చేసుకుని లైక్ లు కొడితే.. ఆ లైక్ లు కాస్త వెయ్యి దాటితే 25,000 నుండి 1,00,000 రూపాయల వరకు వడ్డీ 3% తో పర్సనల్ లోన్స్ ఇస్తారు. ఇంతకీ ఈ లక్షలు ఇచ్చే సంస్థ ఏదనే కదా అక్కడికే వస్తున్నాం “టాటా క్యాపిటల్” ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంకెందుకు ఆలస్యం కథ చెప్పు లైక్లతో నడిచొచ్చే పర్సనల్ లోన్ ని నీ ఖాతాలో వేసుకో.
ఆగడంగండి. షరతులు వర్తిస్తాయి అప్పుడే కై రాసేయకండే.. 2160 ‘సలాం లోన్స్’ పేరిట వినూత్న సదుపాయానికి శ్రీకారం చుట్టిన సదరు సంస్థ కొన్ని కండిషన్స్ పెట్టింది. రుణం పొందేందుకు ముందుగా www.doright.in వెబ్సైట్లోకి వెళ్లాలి. మీ యథార్థ గాథకు అక్షరరూపం ఇవ్వడం లేదా మీ పరిస్థితిని వివరిస్తూ వీడియోను అందులో పోస్ట్ చేయాలి. మీ గాథ ముందుగా సంస్థకి నచ్చితే పోస్ట్ చేస్తారు. ఆ పోస్ట్ అయిన కథ వెబ్సైట్లో వెయ్యి కంటే ఎక్కువ లైకులు సంపాదించుకుంటే అప్పుడు రూ. లక్ష రుణం అందిస్తుంది టాటా క్యాపిటల్ సంస్థ.
ఈ వినూత్న పథకం శ్రీకారం చుట్టేందుకు కారణం మన హైదరబాద్ మహిళ థీనగాతే. హైదరాబాద్కు చెందిన ధనలక్ష్మి భాయ్ వృత్తిరీత్యా టైలర్. భర్త చనిపోవడం తో కుమారుడితో కలిసి జీవిస్తోంది. అతడికి కూడా ఉద్యోగం లేకపోవడంతో బతుకు భారమైంది. తెలిసిన వారి సాయంతో తన దుర్భర పరిస్థితికి అక్షర రూపమి స్తూ టాటా క్యాపిటల్ వెబ్సైట్లో ఆమె ఇటీవల ఓ పోస్టు చేసింది. దాన్ని పరిశీలించిన నిర్వాహకులు ఆ పోస్టును తమ సైట్లోని ‘సలామ్ స్టోరీస్’ పేజీలో పెట్టారు.
ఆమె యథార్థ గాథకు వెయ్యి మంది చలించారు. లైక్లు (సలామ్) కొట్టారు. ఈ లైకులు చూసి టాటా క్యాపిటల్ సంస్థ.. టైలరింగ్ దుకాణం పెట్టుకునేందుకు ధనలక్ష్మికి రూ. ఒక లక్ష రుణం మంజూరు చేసింది. ఈ రుణాలకు సదరు సంస్థ ‘సలామ్ లోన్స్’అని కూడా నామకరణం చేసింది. ఈ ఏడాది మే లో ఈ వినూత్న రుణ సదుపాయానికి శ్రీకారం చుట్టినట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. నిరుపేదలు, చేతివృత్తి దారులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చేతిలో చితికిపో తున్న బాధితులకు అండగా నిలిచేందుకే సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి వినూత్న రుణ ప్రక్రియ ను ప్రారంభించినట్లు పేర్కొన్నాయి.
అర్హతలు, నిబంధనలు ఇవే..
- ఈ విధానంలో వ్యక్తిగత రుణాలు మాత్రమే మంజూరు చేస్తారు.
- తమ కుటుంబ, వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించేలా ఉండే ఫొటోలు, అందుకు సంబంధించిన వివరాలు, వీడియోలు, రుణంతో తాము ఏం చేయాలనుకుంటున్నదీ వివరిస్తూ సదరు సంస్థ వెబ్సైట్లో నమోదు చేయాలి.
- ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందినవారే రుణం పొందేందుకు అర్హులు.
- రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారు, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు కూడా అర్హులే.
- రుణం జారీ స్థాయి రూ.25 వేల నుంచి రూ.లక్షలోపు మాత్రమే. వడ్డీరేటు పావలా.
- రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారి వయసు 21 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి.
- రుణ గ్రహీతల యథార్థ గాథకు (కథనానికి) వెయ్యి లైక్స్ (సలామ్స్) తప్పకుండా రావాలి.
- ఈ రుణాలను పొందినవారు ఐదు నుంచి ఆరేళ్ల కాల వ్యవధిలో వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
- ఏడాది తర్వాత ఈ రుణాల జారీతో లబ్ధి పొందినవారి వివరాలు బహిర్గతం చేయడంతోపాటు, పథకంలో మార్పులు చేర్పులు చేసే యోచనలో ఉన్నారు.
- ప్రధానంగా కుటీర పరిశ్రమలు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు, చేతివృత్తిదారులు, మహిళలకు ఇలాంటి రుణాలు ఆదరువుగా నిలవనున్నాయి.
























