
తెలంగాణ గొప్ప తనాన్ని తెలంగాణ మారుమూల పల్లెల అపార శక్తిని ప్రపంచానికి చాటిన బాలిక పూర్ణ. తెలుగు సత్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మరచినా బాలీవుడ్ మాత్రం హక్కున చేర్చుకుంది. ఎంతో కష్టానికోర్చి ప్రాణాలు పణంగా పెట్టి ఎవరెస్ట్ శిఖారాన్ని అదిరోహించిన 13 ఏళ్ల బాలిక పూర్ణ అరుదైన గౌరవాన్ని అందించింది బాలీవుడ్. పూర్ణ రియల్ స్టోరీ ఆదారంగా తెరకెక్కిన పూర్ణ.. సాహసానికి పరిమితులుండవు మార్చి 31 న విడుదల కాబోతుంది. తెలుగమ్మాయి గొప్ప తనాన్ని మన వాళ్లు తెరకెక్కించే ధైర్యం ఎందుకు చేయలేకపోయారన్నది పక్కన పెడితే బాలీవుడ్ వెండి తెరపై మన తెలంగాణ కథను రేపు తప్పక థియోటర్లో చూడాల్సిందే. పూర్ణ సత్తాని వెండితెర శిఖరాన్ని అదిరోహించేలా చేసిన ప్రముఖ నటుడు, నిర్మాత రాహుల్ బోస్ కు ముందుగా కృతజ్ఞతలు.
పూర్ణ: కరేజ్ హ్యాస్ నో లిమిట్…. ‘సాహసానికి పరిమితులుండవు’… పూర్ణ బయోపిక్ సినిమా పోస్టర్ మీద కనిపించే ట్యాగ్‌లైన్ ఇది. అవును పూర్ణ సాహసానికి ఫరిమితులు లేవు. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన పూర్ణా మలావత ఎవరెస్ట్ ఎక్కేంత వరకు తన సత్తా ఏంటో ఎవరికి తెలియదు. ఒక్కసారి ప్రాణాలకు తెగించి సాహసంతో ఎవరెస్ట్ ను అదిరోహించిన తరువాత ఇక తన సాహసానికి పరిమితులు పెట్టుకోలేదు. ఇప్పుడు బాలీవుడ్ వెండి తెర మీద కనిపించబోతున్న కథ కూడా అదే.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామం…. నిజామాబాద్, కరీంనగర్ జిల్లా సరిహద్దుల్లోని ఈ గ్రామం ఒకప్పుడు మావో ప్రభావిత ప్రాంతం. దీంతో అధికారులు, పోలీసులు పాకాల గ్రామం వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కనీస సదుపాయాలు కూడా లేక ఇబ్బందులు పడ్డారు అక్కడి గ్రామస్థులు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. పూర్ణ విజయంతో ఆ ఊర్లో పెణు మార్పులే చోటు చేసుకుంటున్నాయి. అతి చిన్నవయసులో ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సృష్టించిన పూర్ణ సక్సెస్‌తో ఆ గ్రామం పేరు జాతీయస్థాయిలో మార్మోగింది. దీంతో అందరి దృష్టి ఆగ్రామంపై పడింది. దీంతో ఆ జిల్లాకు చెందిన కలెక్టర్ యోగితా రాణా పాకాలను దత్తత తీసుకున్నారు. గ్రామాన్ని స్వయంగా సందర్శించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. ఇదంతా ఒక్క పూర్ణ సాహసం వల్లే సాధ్యం అయింది. అయితే ఆ అభివృద్ది అక్కడే ఆగిపోలేదు.. ఇప్పుడు బాలీవుడ్ తెర మీద ఆ ఊరి పేరు వినిపించి మరింత అభివృద్దికి కారణం కాబోతుంది. మరీ ఇంత జరిగినా మన తెలుగు వెండితెర పూర్ణ వైపు పూర్ణ కథ వైపు చూసే సాహసం ఎందుకు చేయలేక పోయింది అంటే… మనవంతా అద్దెకు తెచ్చుకునే కథల చిత్రాలే కదా అన్నది విమర్శకుల మాట.
ఇక చిత్ర విషయానికి వస్తే.. బాలీవుడ్లో బయోపిక్‌లకు క్రేజ్ ఎక్కువ. అక్కడి దర్శకులు నిజ జీవిత చరిత్రలకు ప్రాణం పోసి భారీ విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా క్రీడా..సినీ..రాజకీయ రంగాలకు చెందిన వారి జీవిత గాథలను.. దర్శకులు తమదైన శైలిలో వెండితెరపైకి ఎక్కించి కలెక్షన్ల వర్షం కురిపించారు. భాగ్ మిల్కా భాగ్, సుల్తాన్, ధోని, తాజాగా దంగల్ ఇక ఇదే లిస్ట్ లో పూర్ణ కథ వచ్చి చేరబోతుంది. తెలంగాణ బిడ్డ మాలావత్ పూర్ణ జీవితం ఆదారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవాలని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కోరుకోవాల్సిందే.
చిన్న వయసులోనే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ రికార్డును క్రియేట్ చేసిన పూర్ణ వెండితెర మీద సైతం భారీ విజయాన్ని సాధించి పేరును సార్థకం చేసుకోవాలని కోరుకుంటుంది జర్నలిజంపవర్. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శకులు మన వాళ్ల చరిత్రను మరింత గొప్పగా చెప్పేందకు ముందుకు వస్తారని ఆశీస్సు. ఆల్ ది బెస్ట్ పూర్ణ.