
అదృష్టం వెతుక్కుంటూ వచ్చిన దరిద్రం ఇంటి నుండి వెళ్లిపోలేని తిష్ట వేసి కూచోవడంతో ఆ పేద కుటుంబం కటిక దారిద్రాన్ని అనుభవించక తప్పడం లేదు. కొడుకు రూపంలో అదృష్టం నడుచుకుంటూ వచ్చినా పుట్టుకతోనే కొడుకు లక్షాదికారిగా పేరు తెచ్చుకున్నా ఆ ఆనందం కనీసం ఏడాది పాటు కూడా నిలవలేదు. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఓ లక్షాదికారి బుడ్డోడు కన్నతల్లి దరిద్రాన్ని మాత్రం దూరం చేయలేకపోయాడు. నోట్ల రద్దుతో ఒక్కసారిగా అందరి నోళ్లల్లో నానిన ఆ బుడతడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే దరిద్ర దేవత అదృష్టాన్ని అసలు తన గుమ్మ ముందుకే కానీ ఇంట్లోకి రానివ్వదని మరో సారి రుజువైంది.
సరిగ్గా ఏడాది క్రితం.. దేశవ్యాప్తంగా అంతా ఒక్క సారిగా షాక్ గురైన సందర్బం.. ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటనతో ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా అలజడి. క్షణాల్లో బ్యాంకులు ఏటిఎం ల ముందు భారీగా జనం.. నవంబర్ 8 న చోటు చేసుకున్న ఇదే పరిణామం మధ్య ఒక ఆశక్తి కరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నపూర్ దెహత్ జిల్లా సర్దార్ జోగి డేరా విలేజ్ గ్రామస్థురాలైన సర్వేషా డబ్బుల కోసం బ్యాంకు ముందు క్యూ లైన్ల నిలుచుంది. అప్పటికే ఆమె నిండు గర్భిణి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు గంటలు అలాగే క్యూ లైన్లో నిలుచున్న సర్వేషా ఇక ఓపిక లేక అక్కడి మెట్లపై కూలబడింది. అదే సమయంలో పురిటి నొప్పులు రావడం కనీసం క్యూలైన్ నుండి వెనక్కి వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో బ్యాంకు వారి సహకారంతో పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. నోట్ల రద్దు సమయంలో అది కూడా బ్యాంకు లో జన్మనివ్వడంతో ఆ పసిగుడ్డుకు బ్యాంకు సిబ్బంది ‘ఖజాంచీ’ అని పేరు పేట్టేశారు. ఒక్కసారిగా ఆ పేరు దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ వార్త తెలుసుకున్న అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఖజాంచీ కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.2 లక్షలు ప్రకటించేశారు. నోట్ల రద్దు కారణంగా సర్వేషా ప్రాణల మీదకి వచ్చిందని అదృష్టవశాత్తు పండటి బిడ్డకు జన్మనిచ్చిందని నరేంద్ర మోడీ నిర్ణయం ఇలాంటి పరిస్థితులకు కారణం అయిందని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పదే పదే విమర్శించారు. తాము సహకారం అందించకపోతే ఆ కుటుంబం రోడ్డున పడేదని గుర్తు చేశాడు కూడా. ఇక పుట్టగానే లక్షాదికారి అయిన ఖజాంచీ ఉత్తరప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చిన అదృష్టం అంటూ సర్వేషాను అంతా కొనియాడారు.
కానీ సీన్ కట్ చేస్తే ఈ ఆనందం కేవలం నాలుగు నెలలు కూడా మిగల్లేదు. కొడుకు రూపంలో లక్షలు నడిచి వచ్చాయే కానీ అప్పుల బాధకు తాళలేక సర్వేషా భర్త ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. ఖజాంచీ పుట్టడానికి రెండునెలల ముందే పిల్లాడి తండ్రి అప్పుల బాధతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్నినెలలకే కన్నుమూశాడు. దీంతో సర్వేషా మళ్లీ కష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. అయితే కొడుకు రూపంలో వచ్చిన రూ.2 లక్షల సాయంతో భర్త చేసిన అప్పులన్ని తీర్చింది. ఇంత చేసిన అత్తింటి వారు ఆదరించకపోవడమే కాక ఇంట్లో నుండి వెళ్లగొట్టడంతో ఒంటరిగా ఇళ్లు వదిలిరాక తప్పలేదు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితిలో వ్యవసాయ కూలీగా మారి కొడుకును పోశించుకుంటోంది.
అయితే నోట్ల రద్దు కారణంగా లక్షాదికారి అయిన ఖజాంచి ఎలా ఉన్నాడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అని తెలుసుకునేందుకు వచ్చిన ఓ స్వచ్చంద సంస్థ ఖజాంచి కుటుంబ పరిస్థితిని చూసి షాక్ కి గురైంది. ఏడాది తిరక్కుండానే కడు పేదరికంలో బాబు పెరుగుతుండటంతో నివ్వెరపోయింది. అయితే తన కొడుకు తనలా కష్టాలు అనుభవించకూడదని ప్రభుత్వం సాయం చేసి తన కొడుకును ఈ కష్టాల ఊబి నుండి బయట పడేయాలని వేడుకుంటుంది తల్లి సర్వేషా. తను ఎలాగో బ్రతుకుతానని కానీ తన కొడుకు ఖజాంచీ కి మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుతోంది. పుట్టుకతోనే అదృష్టవంతుడిగా పేరున్న ఖజాంచికి ప్రభుత్వం అండగా నిలిస్తే తప్పకుండా భవిష్యత్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సాదిస్తాడని దేశానికి గర్వకారణంగా నిలుస్తాడని చెపుతోంది. చూడాలి మరీ ఆ తల్లి కోరిక మేరకు రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు స్పందించి సాయసహకారాలు అందిస్తాయో.. నోట్ల రద్దు లక్షాదికారి బాలున్ని తిరిగి లక్షాదికారిలా మారుస్తాయో లేదో.
























