
కొన్ని వార్తలు ప్రపంచాన్ని కంట తడి పెట్టిస్తాయి. ఎక్కడో జరిగిన ఘటనకు ఇంకా ఎక్కడో ఉన్న మనసున్న మారాజులు చెలించిపోతారు. పక్కనే కోట్లకు కోట్లు పడగలెత్తిన బకాసురులు మాత్రం ఆ చర్యను కేవలం ఒక ఘటనగానే చూసి పక్కకు తప్పుకుంటారు. ఇప్పుడు చెప్పబోతున్న విషయం యావత్ ప్రపంచానికి సుపరిచితమైన మానవత్వాన్ని మంట గలిపిన ఒకప్పటి ఘటన గురించే. అదే మానవత్వం ఉన్న మనిషి స్పందిస్తే అప్పుడు చచ్చిపోయిన మనిషిలోని మనసు ఇప్పుడేలా మంచి వైపు సాగుతుందో ఈ స్టోరీ చెప్పకనే చెపుతుంది. సాటి మనిషి ఆదుకుంటే తోడుగా నిలిస్తే ఏ వ్యక్తి జీవితమైన ఇలాగే మార్పు వైపు సాగుతుంది.
మాఝీ గుర్తున్నాడు. అలా అడిగితే మీకెలా తెలుస్తుంది లెండి. భార్య శవాన్ని భుజాల మీద మోసుకుని 10 కి.మీ నడిచిన భర్త ధనా మాఝీ గుర్తున్నాడా. ఆ ఎందుకు లేడు మేమంతా కళ్లప్పగించి చూశాం కదా. ఆ ఘటనని చూసి పాపం అని మనసులో అనుకుని మళ్లీ మా పనుల్లో మేము బిజి అయ్యాం కదా అలా ఎలా మర్చిపోతాం అని చెపుతున్నారు కదా. అవును మీరు చెప్పింది నిజమే మనస్సున్న మనసులే అయినా స్పందన లేని రాతి గుండెలా మారి బతుకుతున్నారు కనుక. ఒకే ఇక బండరాయి మనసులు గురించి తరువాత కానీ.. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసా.. అతని జీవితం ఎలా సాగుతుందో తెలుసా.. ఆయన కూతుర్ల పరిస్థితి ఎలా ఉందో ఎవరికైనా తెలుసా. తెలుయదు కదా అందుకే మేము చెపుతున్నా మీరు చదివి తెలుసుకొండి.
అంబులెన్స్ నిరాకరించడంతో భార్య శవాన్ని దాదాపు 10కి.మీ పాటు భుజం మీద మోసుకెళ్లిన ఒడిశావ్యక్తి ధనా మాఝీ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. మానవత్వంతో ఒడిశా వాసులు కనికరించకపోవడం అప్పుడు శాపంగా మారితే అదే శాపం వరమై తన జీవితాన్ని మార్చింది. దేశ మీడియాలో అతడి వార్తలు , అతడికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. దీంతో అతడి దయనీయమైన స్థితి చూసి మనసున్న మారాజులు చలించిపోయాయి. కనీసం భార్య శవాన్ని స్వగ్రామానికి తరలిచేందుకు డబ్బులు లేని పరిస్థితి చూసి కన్నీరుమున్నీరయ్యారు. భారతదేశంలో ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయ అని చలించిపోయిన బహ్రెయిన్ ప్రధాన మంత్రి వెంటనే అతడికి సాయం చేసేందుకు సిద్దమయ్యాడు. వెంటనే రూ.9లక్షల చెక్కును బహ్రెయిన్ రాజు మాఝీకి పంపించారు. దీంతో ధనా మాఝీ జీవితమే మారిపోయింది. బహ్రెయిన్ రాజు బాటలోనే మరికొన్ని స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజనా కింద ఆర్థిక సాయాన్ని అందించింది. కొత్త ఇంటిని నిర్శించి ఇచ్చింది. దీంతో మాఝీ జీవితం అందకారం నుండి వెలుగుల వైపు సాగింది. ఏడాది క్రితం కాలినడక తప్ప మరో దారిలేని మాఝీకి తనను మోయడానికి ఓ ద్విచక్ర వాహనం కూడా వచ్చి చేరింది. అంతే కాదు తన ముగ్గురు కూతుర్ల జీవితం కూడా కడు పేదరికం నుండి వెలుగుల భవిష్యత్ వైపు మారింది. ప్రస్తుతం వారంతా ఓ కాన్వెంట్ స్కూల్ లో చదువుకుంటున్నారు. అంతే కాదు మాఝీ మళ్లీ వివాహం కూడా చేసుకొన్నాడు అంతేనా అతని భార్య ప్రస్తుతం గర్భవతి కూడా. చనిపోయిన తన భార్యే మళ్లీ తనకు కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాడు ధనా మాఝీ.
భార్య మరణంతో మరింత కుంగిపోయిన ధనా మాఝీకి మానవత్వపు మనసుల సాయం ఆ కుటుంబాన్నే మార్చింది. ఈ కథ కథగా కాకుండా దేశం మొత్తం మానవత్వంతో స్పందించే పాఠంగా తీసుకుంటే అసలు ఒడిశాలో కాదు భారతదేశంలోని ధనా మాఝీలంతా కొత్త జీవితాన్ని గడపడం ఖాయం. అందుకే ఒక్కసారి మానవత్వంతో స్పందిద్దాం.. అక్కడెక్కడో కాదు మన పక్కనే ఉన్న ధనా లాంటి వ్యక్తుల జీవితాలను మారుద్దాం. బహ్రెయిన్ రాజులు కాదు మేము కూడా మనసున్న మారాజులమే అని నిరూపిద్దాం. ఆల్ ది బెస్ట్ ధనా మాఝీ.. బండి మీద రయ్యురయ్యుమంటూ సాగిపో.
























