
బ్యాంకులు సర్ ఛార్జ్ లు విధించేందుంకు సిద్దపడిన విషయం తెలిసిందే. ఈ బ్యాంకు ఆ బ్యాంకు అని తేడా లేకుండా అన్ని బ్యాంకులు తమకు నచ్చిన తీరుగా సేవా రుసుం విధించి సామాన్యుడి కష్టార్జితానికి శఠగోపం పెట్టేసాయి. మరీ ఏ బ్యాంకు ఏ రేంజ్ లో ముక్కు పిండుతుందో.. ఏ ఏ బ్యాంకులు ఎంతెంత సర్ ఛార్జి రూపంలో పన్నులు విధిస్తున్నాయో తెలుసా. ఇదిగో ఇవే ఆ దండనల డీటేల్స్. డిపాజిట్ చేసినా విత్ డ్రా చేసిన దండన మాత్రం తప్పదంటున్నాయి బ్యాంకులు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) : దేశ వ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ బ్యాంకు తమ ఖాతాదారులకు అంతే రేంజ్ లో చుక్కలు చూపిస్తోంది. ఖాతదారుల సేవింగ్స్ అకౌంట్లో నేరుగా మూడుసార్లు మాత్రమే ఎలాంటి సర్ ఛార్జీలు లేకుండా డిపాజిట్ చేసుకోవచ్చు. మూడు సార్లు డిపాజిట్ చేసిన తర్వాత అదే నెలలో నాలుగవ సారి నుంచి జరిగే ప్రతి లావాదేవీలపై రూ.50 సేవ పన్ను విధిస్తుంది. అంటే నెలలో 3 సార్లు మాత్రమే ఫ్రీగా అకౌంట్లో డబ్బులు జమ చేసుకోవచ్చు. అంతే కాదు మీమీ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లేకున్న దండన తప్పదు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత ఖాతదారులకు కాస్త తక్కువ జరిమాన విధించేందుకు సిద్దమైంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక పట్టణాల్లో ఉండే ఖాతదారులకైతే సర్ ఛార్జిలతో ఎస్బీఐ దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. మెట్రో పాలిటన్ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.5000 తప్పక ఉండాలి. ఇందులో 75 శాతం తక్కువగా అంటే 1500 రూపాయలకంటే కిందికి ఉంటే రూ.100 జరిమానా విధిస్తానంటోంది ఎస్బీఐ. అదే 50 శాతానికి మించి ఉంటే సేవ పన్నును రూ.50 విధించనుంది.
ఇక విత్ డ్రా విషయానికి వస్తే మూడు సార్లు దాటితే రూ.20 సర్ ఛార్జీ విధిస్తుంది. సొంతం ఏటీఎంలలో కూడా కేవలం ఐదు సార్లు మాత్రమే అవకాశం ఇస్తోంది.. ఆ ఛాన్స్ దాటితో ప్రతి డ్రాకి రూ.10 చొప్పును సర్ ఛార్జీ రూపంలో వసూళు చేస్తుంది ఎస్బీఐ. ప్రభుత్వ బ్యాంకే ఇన్ని కొర్రిలు పెడితే ప్రైవేటు బ్యాంకులు ఇంకా ఎంతగా ఛార్జ్ ల మోత మోగించాలి. మరీ ఆ బ్యాంకులు ఎంతగా ఛార్జిల మోత మోగిస్తున్నాయో చూద్దాం.
యాక్సిస్ బ్యాంక్ః యాక్సిస్ తమ ఖాతాదారులకు నెలకు 5 లావాదేవీలు ఎలాంటి రుసుము లేకుండా జరపుకోవచ్చని చెబుతోంది. 5 దాటితే మాత్రం ఒక్కో ట్రాన్సాక్షన్స్ పై ఏకంగా రూ.95 వసూలు చేస్తానంటోంది. ఎస్బీఐ తో పోలిస్తే యాక్సిస్ వడ్డింపు డబుల్.
HDFC బ్యాంక్ః హెచ్డీఎప్సీ మాత్రం ఈ విషయంలో భారీ కొర్రిలు పెట్టింది. తన ఖాతాదారులు నెలకు డిపాజిట్స్ కానీ విత్డ్రాయల్స్ కానీ కేవలం 4 సార్లు మాత్రమే చేసుకోవచ్చని చెపుతోంది. ఆపైన చేసే ఒక్కో ట్రాన్సాక్షన్స్కు రూ.150 వసూలు చేస్తుందంట. ఇక అన్ని బ్యాంకుల్లో కాకుండా దోపిడిని దర్జాగా చేస్తు సేవింగ్స్ అకౌంట్లతో పాటు శాలరీ అకౌంట్లకు కూడా వర్తింపచేస్తు నిర్ణయం తీసుకుంది. దీంతో హెచ్డీఎఫ్సీ ఖాతదారులకు లావా దేవిలు జరపడం కత్తి మీద సామే.
ఐసిఐసిఐ బ్యాంక్ః ఇక ఐసిఐసిఐ కూడా అన్ని బ్యాంకుల దారిలోనే ఛార్జ్ ల మోత మోగిస్తుంది. తమ ఖాతదారులు చేసుకునే మొదటి 4 లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. కానీ ఆపై ప్రతి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీలు విధిస్తుంది. ఇక నాన్ హోమ్ బ్రాంచ్లలో జరిపే లావాదేవిల్లో నెలలో ఒక్క సారి మాత్రమే అవకాశం ఇస్తుంది. ఆ తర్వాత జరిపే ఒక్కో లావాదేవీపై ప్రతి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీలు విధిస్తోంది.
ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు వేస్తున్న వేటు సామాన్యుడికి ముచ్చమటలు పట్టిస్తున్నాయి. ఇక దాచుకోవడం తరువాత ఉన్నవి పోకుండా కాపాడుకోవడం ఎలాగా అని ఆలోచనలో పడేలా చేస్తున్నాయి బ్యాంకులు.
























