You are here
Home > అంతరంగం > జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..

జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..

ఖాకీ చొక్కా  గొప్ప తనం గురించి చాలానే కథనాలు రాశాం.. మంచిని చెప్పాం.. చెడును చీల్చి చెండడాం.. కానీ ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మాత్రం పదాలు చాలడం లేదు. ఎంత గొప్పగా చెపుదామని ప్రారంభించినా ఇంకా ఏదో వెలితి కనిపిస్తోంది. దేవుడంటే ఎక్కడో లేడు ఖాకీ చొక్కావేసుకున్న మలిశెట్టి. రమణ గారి రూపంలో నిండుగా కొలువై ఉన్నాడని చెపుతున్నాం. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. అనాధలకు ఆయనే పెద్ద దిక్కు.  పున్నామ నరకం నుంచి తప్పించి ఎందరో అనాధ శవాలకు మోక్షాన్ని ప్రసాదించారు ఆయన. గుళ్లకు గోపురాలకు గంటలకు వేదమంత్రాల మంటలకు లక్షల కోట్లు సమర్పించే ఎందరో కోటీశ్వరుల కంటే రమణ గారు వేల వేల మానవత్వపు మనసున్న మారాజు. ఏకాకి జీవితాలకు ఆశ్రయం ఇచ్చి జగమంతా కుటుంబంగా మారుస్తున్న ఆయన సేవ గురించి ఓ మచ్చుకు కథనం. మా అక్షరాలతో ఆయన సేవను సమాజానికి చెప్పే అదృష్టం కలిగినందుకు దన్యులం.

మలిశెట్టి.వెంకటరమణ వృత్తి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రవృత్తి సేవ.. సాయం.. మానవత్వం.  భూమికి పచ్చాని రంగేసినట్టుగా కనిపించే పచ్చని ప్రకృతి వనమే ఆయన సేవా మందిరం. పేరు తపోవనం… సేవకు నిలువెత్తు ఆలయం.

కడప జిల్లా సిద్దవటం మండలానికి కూత వేటు దూరంలో మూడున్నర ఎకరాల ప్రశాంత వాతవరణంలో కొలువై ఉంది ఈ సేవాలయం. రమణ గారి ఆలోచనల్లో ఇదే దేవాలయం.. అనాధల సేవాలయం.. ఏకాకి బ్రతుకులకు కొండంత అండగా నిలిచే తపోవనం. ఇక్కడ అనాధలు ఎవరు ఉండరు అంతా అయిన వారే.. అనాధ అంటే ఏ తోడు లేని వారు ఇక్కడ అందరికి కొడుకులా నేను తోడున్నా.. చుట్టాలు బంధువుల్లా ఒకరికి ఒకరు తోడున్నారు అంటారు రమణ గారు.

https://www.facebook.com/profile.php?id=100008288701459
ఆయన ఫేస్ బుక్ లో ముందు మాట పరోపకారమే మనిషి ప్రధమ ధర్మం ( కర్తవ్యం ) అని కనిపిస్తుంది. అందులోనే ఆయన ఏంటో కనిపిస్తుంది. ఇక ఆయన చేసే అత్యంత గొప్ప పని దిక్కులేక అనాధగా మరణించిన వారి దేవాలకు అన్ని తానై అంత్యక్రియలు చేయడం.కులం మతం వర్గం ఇవేమి ఆయన సేవలో కనిపించవు.. కనిపించేదంతా ఒక్కటే మానవత్వం.. మహాత్ముని తత్వం.  ఇప్పటి వరకు 500 మృతదేహాలకు పైగానే ఆయన అంతిమ సంస్కారాలు జరిపారు. తూతూ మంత్రంగా కాకుండా వారి వారి సంప్రదాయల ప్రకారం దహన సంస్కారాలు చేస్తారు వెంకట.రమణ గారు. ఆయన సేవను పొందేందుకు చుట్టు పక్కల ఉన్న ఏకాకి వృద్దులు ఆయన ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వస్తారు. ఎంత మంది వచ్చినా ఆయన సేవకు మాత్రం లోటు ఉండదు.


తపోవనం లో వందల మంది వృద్దులు జగమంత కుటుంబం గా కలిసిమెలిసి ఆనందంగా గడుపుతున్నారు. ఈ మధ్య జరిగిన శ్రీరామనవమి పండక్కి వృద్దులతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకున్నారు రమణ గారు. ఇదే అయోద్య .. ఇదే భద్రాచలం.. ఇదే కోదండరామస్వామి దేవాలయం… అంతా ఆశ్రమమే అంటారాయన. ఈరోజు ఆశ్రమంలో వడపప్పు పానకం దోసపప్పు రుచికరమైన బోజనం. ఈ వృద్దులు ఆనందిస్తే శ్రీరామచంద్రుడు సంతోషించినట్లే కదా అంటు కల్మషం లేని ఓ చిరు నవ్వు నవ్వుతారు.

ఆ వృద్దులకు ఇంత కంటే కావాల్సింది ఏంటి చెప్పండి. దేవుడు ఎక్కడో లేడు ఖాకీ చొక్కా వేసుకున్న మలిశెట్టి. వెంకటరమణ రూపంలో కడపలో కొలువై ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మేము ఈ కథనంలో ఆయన గురించి చెప్పింది గోరంత మాత్రమే ఇంకా ఇంకా ఆయన సేవలు అమోగం. ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసే ప్రతి ఒక్కరు ఆయనకి చేతులెత్తి మనస్పూర్తి మొక్కుతారంటే ఆయన ఎంత గొప్ప వారో ఇంకా చెప్పాల. జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితం మనది అంటున్న రమణ గారికి జర్నలిజంపవర్ తరుపున సెల్యూట్. మానవత్వ శిఖరమా నీకు వందనం. వర్దిల్లు నూరేళ్లు. 

Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!