
ఆడబిడ్డకు సదువేంది. లక్షలు లక్షలు దారపోసి పెద్ద సదువులు చదివిపిస్తే చివరికి అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా. చదువుకు పెట్టే ఖర్చు పెళ్లికి పెడితే అయిపోయేది కదా. ఇది ఆడబిడ్డలు ఉన్న ఇంట వినిపించే మాట. కానీ ఈ అమ్మాయి ఇంట్లో మాత్రం పెళ్లికి కూడబెట్టాల్సిన అవసరం లేకుండానే సర్కార్ నౌకరీతో బంగారు పంటను పండించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకే సమయంలో మూడు ప్రభుత్వ కొలువులను దక్కించుకుంది. అది కూడా తెలంగాణలో. సర్కార్ కొలువే గగనమైన ఈ సంధర్భంలో దివ్యభారతి దివ్యంగా ప్రభుత్వ కొలువును సాదించింది. అందులోను పోలీసు ఉద్యోగాలు సాదించి శభాష్ భారతి అనిపించుకుంది.
ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం రావడమే కష్టం.. ఒక పోస్టుకి ప్రకటన వస్తే.. లక్షల్లో దరఖాస్తులు రావడం తెలిసిందే. అలాంటిది ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు అదీ పోలీసు ఉద్యోగాలు సంపాదించడం అరుదైన విషయమే. బీడీ కార్మిక కుటుంబంలో పుట్టిన ఓ చదువుల సరస్వతి ఆ మూడు ఉద్యోగాలను ముచ్చటగా అందుకుంది. ఆమే దివ్యభారతి. మీరు మీ పిల్లలకి కట్నం ఇస్తున్నారు. నేను నా పిల్లలకి కట్నంగా చదువుని ఇస్తున్నాను అంటాడు దివ్యభారతి తండ్రి పోతని గణేష్. తండ్రికి ఇచ్చిన మాటను అక్షరాల నిజం చేస్తు మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాదించింది.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామం దివ్యభారతి స్వస్థలం. తండ్రి పోతని గణేష్ బీడీ కమిషన్ ఏజెంట్. తల్లి బీడీ కార్మికురాలు. పదోతరగతి వరకూ దివ్యభారతి చదువు ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. 81శాతం మార్కులతో పాసైన భారతి ఇంటర్ సైతం లోకల్ లోనే 89 శాతం మార్కులతో పూర్తి చేసింది. పై చదువుల కోసం హైదరాబాద్ కు చేరిన భారతి అరోరా కాలేజీలో బీటెక్ లో జాయిన్ అయింది. తెలుగు మీడియం బ్యాగ్ గ్రౌండ్ కావడంతో బీటెక్ చాలా కష్టంగానే సాగింది. ఎలాగోలా బీటెక్ పూర్తి చేసుకున్న దివ్యభారతి మరింత పట్టుదలతతో ఎంటెక్లో సీటు సాధించింది. చెన్నైలోని సత్యభామా యూనివర్సిటీలో చేరిన తరువాత భవిష్యత్ పై పూర్తిగా పట్టు సాదిందిచింది. పాత తప్పులు పునరావృతం కాకుండా మొదటి నుంచే పక్కా ప్రణాళికతో చదవడం మొదలు పెట్టి ఎంటెక్ లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణీరాలు అయింది.
ఈ క్రమంలోనే అమ్మాయిలపై జరుగుతోన్న దాడులూ, అఘాయిత్యాలు…చాలావరకూ పోలీస్ కేసుల వరకూ వెళ్లని సందర్భాలను చూసిన భారతి ఎట్టి పరిస్థితిలోను ఖాకీ చొక్క నౌకరీ సాదించాలని ఫిక్స్ అయింది. అనుకున్నదే తడువుగా ఇంట్లో నాన్నకి చెపితే వద్దు బిడ్డా ఆ కొలువు నువ్వు చదవిన చదువుకు ఏసీ ఉద్యోగాలొస్తాయి అన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా పట్టుదలతో పోలీస్ నౌకరి పై దృష్టి పెట్టింది భారతి. ఎంటెక్ పూర్తయ్యే సమయానికి ఎస్ఐ నోటిఫికేషన్ పడటం.. వెంటనే దరఖాస్తు చేయడం. పోలీసు ఉద్యోగానికి శారీరకదార్ఢ్యం కోసం శిక్షను తీసుకోవడం జరిగిపోయాయి. కానీ తీరా మెయిన్స్ దగ్గర పడే సమయానికి డెంగీ జ్వరం వచ్చింది. దాదాపు పన్నెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి రావడంతో ఇక జాబ్ పై ఆశలు వదులుకుంది. కానీ స్నేహితుల అండంతో ఎట్టకేలకు పరీక్ష రాసింది భారతి. ఎస్సై ఉద్యోగంతో పాటు కానిస్టేబుల్, అబ్కారీ ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకున్న భారతీ వాటిని కూడా విజయవంతంగా ఎదురుకుంది. చివరికి ఉద్యోగ ఫలితాలు రావడం.. పరీక్షలు రాసిన మూడింటిలో మూడు విజయం సాధించడంతో భారతి ఆనందం మరింత రెట్టింపు అయింది. ఇక భారతి కుటుంబసభ్యుల ఆనందం అయితే చెప్పలేం. అంతగా ఉబ్బి తబ్బియ్యారు. ఆడపిల్లకు చదువు ఎందుకు అన్న వారే ముచ్చటగా మూడు ఉద్యోగాలు సాదించడంతో శభాష్ దివ్యభారతి అని కితాబిస్తున్నారు. మా ఆడపిల్లలను భారతిలాగే పెద్ద చదువులు చదివిస్తామని చెపుతున్నారు.
























