You are here
Home > తాజా వార్త‌లు > అష్టమ వ్యసనం.. స్మార్ట్‌ ఫోన్‌. ఈ వ్యసనం భారీన పడ్డారో ఇక అంతే.

అష్టమ వ్యసనం.. స్మార్ట్‌ ఫోన్‌. ఈ వ్యసనం భారీన పడ్డారో ఇక అంతే.

‘‘టెక్నాలజీలు పెరిగి చేతుల్లోకి ఫోన్లొచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలిగానీ.. ఇలా పెరిగిపోతోందేమిట్రా’’ ఓ ప్రశ్న.. సమాదానం ‘‘తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్‌. దాన్ని వాడే మనుషుల్లోనే ఉంది’’ నిజమే.. తప్పు మనలోనే ఉంది. దాన్ని సరిదిద్దుకోగలిగే తెలివీ మనలోనే ఉంది. ఓ సారి ఈ స్టోరీ చదివి మీ తప్పును సరిదిద్దుకుంటారేమో చూడండి. 

మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది స్మార్ట్ ఫోన్. దూరంగా ఉన్న మనుషుల్ని కలపడానికి కనుక్కొన్న ఫోన్‌.. ఒక దగ్గరే ఉన్న మనుషుల్ని దూరం చేస్తోంది. దూరంగా ఉన్నా మాట్లాడుకోవడానికి కనిపెట్టిన మొబైల్‌ఫోన్‌.. భార్యాభర్తల మధ్య మాటల్లేకుండా చేస్తోంది

చిన్నా లేదు.. పెద్దా లేదు. అంతా ఫేస్‌బుక్‌ లైకింగ్‌.. వాట్సప్‌ షేరింగ్‌.. యూట్యూబ్‌ వాచింగ్‌.. ఇప్పుడు అందరిదీ ఇదే పని. ఇంటెడు చాకిరీ చేసే భార్యను పట్టించుకోని మగానుభావులు.. పొద్దున లేవగానే ఊరందరికీ గుడ్‌మార్నింగ్‌ మెసేజ్‌లు పెడుతుంటారు.

ఫేస్‌బుక్‌ లోగోలో ‘ఎఫ్‌’ అక్షరం లాగా.. తలకాయ వంచి అరచేతిలో ఫోన్‌ని దీక్షగా చూస్తూ రోడ్డుకు అడ్డంగా నడుస్తుంటుందో అమ్మాయి!! ఇయర్‌ఫోన్స్‌ చెవుల్లో పెట్టి.. పాప్‌ సాంగ్‌ హైపిచ్‌లో పెట్టి బైక్‌ మీద రయ్‌రయ్య్‌న దూసుకుపోతుంటాడో కుర్రాడు!! చెవులు పగిలిపోయేలా హారన్‌ కొట్టినా వారికి వినపడదు. వాళ్ల లోకం వాళ్లది. రోడ్ల మీదే కాదు.. ఇళ్లల్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి. ఎవరి గోల వారిది. స్మార్ట్‌ ఫోన్లు.. ఇప్పుడు అష్టమ వ్యసనంలా తయారై కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి.

స్మార్ట్ ఫోన్లు లేని కాలంలో..
రాజు తెల్లవారుజామున నాలుగున్నరకే నిద్ర లేచాడు. ‘కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి.. కరమధ్యే స్థితాగౌరీ ప్రభాతే కరదర్శనం’ అని భక్తిగా చదువుకుంటూ అరచేతులు చూసుకున్నాడు. మంచం మీద నుంచి దిగి నేరుగా పెరట్లోకి వెళ్లి పళ్లుతోముకుని కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ఉద్యోగానికి వెళ్లాడు. రోజంతా విధులు నిర్వర్తించి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో సరదాగా కాలక్షేపం చేసి కాసేపు టీవీలో చిత్రలహరి, వార్తలు చూసి 9 గంటలకు నిద్రకుపక్రమించాడు.

ట్రెండీ 2017 పరిస్థితి వచ్చాక.
రాజు కొడుకు పొద్దున 8 గంటలకు లేచాడు. తలగడ పక్కనే ఉన్న ఫోన్‌ని చేతిలోకి తీసుకున్నాడు. లక్ష్మి అనే అమ్మాయి నుంచి వచ్చిన వాట్సప్‌ మెసేజ్‌ చూసుకున్నాడు. సరస్వతి పంపిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ ఓకే చేశాడు. గౌరి పంపిన మెసెంజర్‌ మెసేజ్‌కి రిప్లై ఇచ్చాడు. 9 గంటల దాకా పక్కమీదే అలా గడిపి.. ఆనక ఆదరాబాదరాగా లేచి ఫోన్‌లో ఫేస్‌బుక్‌ చూసుకుంటూనే పళ్లు తోమాడు. టిఫిన్‌ తినేటప్పుడూ అదే తంతు. ఆఫీసుకు వెళ్లాక కూడా పనితోపాటు.. వాట్సప్‌ మెసేజ్‌లకు రిప్లైలు.. ఫేస్‌బుక్‌లో లైకులు, షేర్లు!! సాయంత్రం ఇంటికొచ్చాక కూడా ఫోన్‌ చేతిలోనే! ఎడతెగని ఫేస్‌బుక్‌ పోస్టులు, వాట్సప్‌ మెసేజ్‌ల వర్షం. వాటిని చూస్తూనే భోజనం. అమ్మానాన్నలతో ముక్తసరి మాటలే! పడగ్గదిలోకి వెళ్లాక తనను అల్లుకున్న భార్యను కుడిచేతితో పట్టుకుని.. ఎడమ చేత్తో సోషల్‌ మీడియా మెసేజ్‌లు చూస్తూనే ఉన్నాడు!

ప్రేమలు, ఆప్యాయత, అనుబంధాలు.. ఇవన్నీ భారతీయ కుటుంబవ్యవస్థ బలం. వేల ఏళ్ల ఈ ఘనతను జస్ట్‌ పదంటే పదేళ్లలో బదాబదలు చేసిన ఘనత స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియాదే! ఇంట్లో వైఫై కనెక్షన్‌.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. ఫేస్‌బుక్‌ ఖాతాలు, వాట్సప్‌ గ్రూపులు.. లైకులు, షేర్లు, ఫార్వర్డ్‌లు..!! ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ఇంటికి వచ్చిన చుట్టాలు మాట్లాడుతుంటే.. పట్టించుకోకుండా మధ్యలో ఫోన్‌ చూసుకోవడం సాధారణ విషయమైపోయింది. వచ్చినవాళ్లదీ అదే తీరు! అలాగే.. గతంలో ఏదైనా పెళ్లికో పేరంటానికో వెళ్తే అందరూ సరదాగా మాట్లాడుకునేవారు. వరసైనవాళ్లు సరసాలాడు కోవడం బావాబావమరుదుల మధ్య చలోక్తులు.. ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏ ఫంక్షన్‌లో చూసినా అందరి చేతుల్లోనూ ఫోన్లే. వాట్సప్‌ షేరింగ్‌లు.. మెసేజ్‌ల ఫార్వర్డ్‌లే. బంధాలు బలహీనపడటానికి ఇవి చాలవా..? ఈ తరహా వైఖరి వల్ల కుటుంబసభ్యులు, బంధువుల మధ్య మాటలు కరువైపోతున్నాయి. సంబంధాలు దెబ్బతింటున్నాయి.

అనుమానపు చిచ్చు
‘‘అర్ధరాత్రి 2 గంటల మెసెంజర్‌లో యాక్టివ్‌గానే ఉన్నావు కదా..? మరి నా మెసేజ్‌కు ఎందుకు రిప్లై ఇవ్వలేదు’’.. ‘‘వాట్స్‌పలో నీ ‘లాస్ట్‌ సీన్‌’ రాత్రి 12.30 చూపించింది. కానీ నేను 12 గంటలకు ఫోన్‌ చేస్తే ఎందుకు ఎత్తలేదు…? ఇవీ ఇటీవలికాలంలో దాదాపు ప్రతి ఇంట్లో వినపడుతున్న మాటలు. భర్త తన మెసేజ్‌కు రిప్లై ఇవ్వకపోతే భార్యకు అనుమానం. భర్త ఫోన్‌ చేసినప్పుడు భార్య లిఫ్ట్‌ చేయకపోతే అనుమానం పెనుభూతమే! స్మార్ట్‌ఫోన్లలో మెసెంజర్‌ యాప్‌ల యాక్టివ్‌ స్టేట్‌సలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఒకవేళ ఆయా యాప్‌ల్లో ఉన్న ఆప్షన్ల ద్వారా యాక్టివ్‌ స్టేటస్‌, లాస్ట్‌సీన్‌ వంటివి కనపడకుండా చేసినా అది కూడా సమస్యగానే మారుతోంది. ‘‘నాకు దొరక్కూడదనే కదా.. వాట్స్‌పలో ‘లాస్ట్‌ సీన్‌’, ‘బ్లూ టిక్‌’ ఆప్షన్లు తీసేశావు’’ అంటూ ఒకరినొకరు అనుమానించుకునే పరిస్థితి. ఆన్‌లైన్‌లో భాగస్వామి స్టేటస్‌ ‘యాక్టివ్‌’లోనే ఉన్నా తమ కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందించకపోవడం కొందరిలో మానసిక అశాంతికి, అంతిమంగా మానసిక సమస్యలకు సైతం దారితీస్తోంది.

అమ్మాయిలు ఈ వ్యసనానికి బానిసలైతే మరింత ప్రమాదం. వారి దగ్గర డబ్బు లేని సందర్భాల్లో.. ‘డ్రగ్స్‌ కావాలంటే నీ నగ్నచిత్రాలు పంపించు’ అని డ్రగ్‌ పెడ్లర్స్‌ అమ్మాయిలను అడుగుతున్నారు. మత్తుకు బానిసైన అమ్మాయిలు అందుకూ సిద్ధమవుతున్నట్టు ఇటీవల బయటపడ్డ కేసుల్లో స్పష్టమైంది. తొలదశల్లో నగ్న చిత్రాలు చూపించాలని కోరే డ్రగ్‌ పెడ్లర్స్‌.. మరికొన్ని రోజులు పోయాక లైంగిక కోర్కెలు తీర్చాలనీ కోరుతున్నారు. ఈ రెండో దశలోకి వెళ్లిన అమ్మాయిలు కూడా కొందరు ఉన్నట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని విశ్వసనీయవర్గాలు పేర్కొనడం ఆందోళనకరం.

మంచి కూడా..
స్మార్ట్‌ఫోన్‌ వల్ల అన్నీ నష్టాలే కాదు.. కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. వేరే ఊళ్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు రాత్రిపూట ఎంతసేపటి దాకా మేలుకొని ఉంటున్నారన్నది తల్లిదండ్రులు.. వారి యాక్టివ్‌ స్టేటస్‌, వాట్సప్‌ లాస్ట్‌సీన్‌ వంటివాటి ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. పిల్లలకు ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా ఈ యాప్‌ల వల్ల సాధ్యమవుతోంది. అంతేకాదు.. జంటల మధ్య చిచ్చుపెడుతున్న ఈ యాప్స్‌నే అనుబంధాలు పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

భాగస్వామి మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేసే చిన్నచిన్న మెసేజ్‌లు.. అవి సొంతంగా రాయనక్కర్లేదు.. వచ్చినవాటిని ఫార్వర్డ్‌ చేసినా సరిపోతుందని వారు సూచిస్తున్నారు. అలాగే.. ఇంట్లో అన్నం తినేటప్పుడు డైనింగ్‌ టేబుల్‌ వద్దకు, పడగ్గదిలోకి ఫోన్‌ తీసుకెళ్లకుండా ఉండగలిగితే చాలావరకూ సమస్యలు సమసిపోతాయని వారు చెబుతున్నారు. పిల్లలు సోషల్‌ మీడియాలో ఎవరితో టచ్‌లో ఉంటున్నారో మధ్యమధ్య పర్యవేక్షించడం మంచిదని సూచిస్తున్నారు.

స్మార్ట్‌’ రోగాలు
స్పాండిలైటిస్‌ లాంటి వి ఒకప్పుడు కొద్దిమందికే వచ్చేవి. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక చాలామంది ఆ సమస్యతో బాధపడుతున్నారు. అదొక్కటే కాదు.. స్మార్ట్‌ఫోన్ల వల్ల ఎక్కువగా వస్తున్న ఆరోగ్య సమస్యలు చాలానే ఉన్నాయి. మచ్చుకు కొన్ని..

టెక్ట్స్‌ నెక్‌
పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌ వాడేవారికి వచ్చే సమస్య ఇది. మెడ నిటారుగా ఉన్నంతకాలం దానికి ఎలాంటి సమస్యలూ రావు. కానీ.. స్మార్ట్‌ఫోన్లు చూసేక్రమంలో మనం మెడను 60 డిగీల్ర మేర కిందికి వంచుతాం. ఇలా ఎప్పుడైనా చేస్తే ఫర్వాలేదుగానీ.. రోజూ గంటల తరబడి, అలా ఏళ్ల తరబడి చూస్తే మెడనొప్పితో మొదలై వెన్నుపూస సమస్యలకు దారితీస్తుంది. ఫోన్‌ను అరచేతిలో పెట్టి కిందకు చూడకుండా మీచేతినే ముఖం దగ్గరకు తీసుకొచ్చి మెడ నిటారుగా ఉంచి చూస్తే ఈ సమస్య రాదు.

చూపు మందగించడం
సెల్‌ఫోన్‌ స్ర్కీన్లకు తగినట్టుగానే ఫాంట్‌ సైజ్‌ ఉంటుంది. వాటినే ఎక్కువసేపు చూస్తూ ఉండడం మన చూపును దెబ్బతీస్తుంది. చీకట్లో సెల్‌ఫోన్‌ ఎక్కువసేపు చూస్తే సమస్య వేగంగా ముదురుతుంది. స్మార్ట్‌ఫోన్లను అలాగే ఎక్కువసేపు పట్టుకుని చూస్తే మణికట్టుపై భారం పెంచి సమస్య తెస్తుంది.

వేళ్ల తిమ్మిరి..
మెసేజ్‌లు ఎక్కువ సేపు పంపే వారికి ఈ సమస్య వస్తుంది. వేళ్లు, మణికట్టు.. మోచెయ్యి కింది నుంచి వేళ్లదాకా చేతులకు చాలా సమస్యలు వస్తాయి.. ఇక ఫోన్‌ చేతిలో లేకుంటే అసహనం, మనం ఫోన్‌ చేసినప్పుడు అవతలి వ్యక్తి కాల్‌ రిసీవ్‌ చేసుకోకుంటే కోపం వంటి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి, బీపీ, గుండెజబ్బు లకు దారితీస్తాయి. తస్మా త్‌ జాగ్రత్త..

ఇలా చేయొచ్చు..
పాశ్చాత్య దేశాల్లో స్మార్ట్‌ఫోన్‌ వ్యసనానికి విరుగుడుగా రకరకాల మార్గాలు కనుగొంటున్నారు. వాటిలో ముఖ్యమైనవి..
గంటో.. రెండు గంటలో.. ఒక నిర్ణీత సమయం అనుకుని ఆ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్‌ను వాడకపోవడం.
భోజనం చేసే సమయంలో కుటుంబసభ్యులెవరూ ఫోన్‌ వాడకూడదని స్వీయనియంత్రణ విధించుకోవడం. పడగ్గదిలో వైఫై, చార్జింగ్‌ వంటి సౌకర్యాలు తీసేయడం. అసలు ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ ఏవీ తీసుకెళ్లకుండా ఉండడం.
జోడెడ్ల మధ్య మూడో ఎద్దు. సంసారం అనే కాడిని మోసే జోడెడ్లుగా భార్యాభర్తలను వ్యవహరించడం మనందరికీ తెలిసిందే! అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సి టీ, బ్రిగ్‌మాన్‌ యంగ్‌ యూనివర్సిటీ (యూటా) సైకాలజిస్టుల ప్రకా రం.. ఇటీవల సంసారంలో ‘నెట్‌ కనెక్షన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌’ అనే మూడో ఎద్దు కూడా చేరింది. ఇది కాపురాల్లో చిచ్చుపెడుతున్న ఎద్దని వారు 2013లోనే నెత్తీనోరూ మొత్తుకుని చెప్పారు. వారు నిర్వహించిన ఓ సర్వేలో పాల్గొన్న మహిళల్లో 75 శాతం మంది.. తమ భాగస్వాములతో బంధం చెడిపోవడానికి స్మార్ట్‌ఫోన్లే కారణమని చెప్పారు. తాము ఎంతో ముఖ్యమైనదిగా భావించే విషయం గురించి మాట్లాడేటప్పుడు.. తమ భాగస్వాములు సీరియ్‌సగా ఫోన్లో నోటిఫికేషన్లు చూసుకుంటుంటారని, ఇది తమకు చాలా అసహనాన్ని కలిగిస్తుందని చెప్పారు.

ఇదీ లెక్క..
ఫోన్లలో నెట్‌ వినియోగం మనదేశంలో శరవేగంగా పెరుగుతోంది. జియో వచ్చాక అది మరింత వేగవంతమైంది. ఆ లెక్కలు ఒకసారి చూస్తే..
27.28 కోట్లు: టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ఉన్న మొబైల్‌ ఇంటర్‌నెట్‌ వినియోగదారుల సంఖ్య ఇది. అంటే స్మార్ట్‌ఫోన్లలో నెట్‌ వాడేవారు.
43.2 కోట్లు: ఇంటర్‌నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, మార్కెట్‌ రిసెర్చ్‌ సంస్థ ఐఎంఆర్‌బీ ఇంటర్నేషనల్‌ గణాంకాల ప్రకారం దేశంలో ఇంటర్‌నెట్‌ వినియోగదారుల సంఖ్య ఇది. మొబైల్‌ నెట్‌ వాడకందారుల సంఖ్యకూడా ఇందులోనే ఉంది.
26.9 కోట్లు: దేశంలో 44.4 కోట్లుగా ఉన్న పట్టణ ప్రాంతాల ప్రజల్లో నెట్‌ వినియోగదారులు.
16.3 కోట్లు: గ్రామీణ జనాభాలో నెట్‌ వాడేవారు.

ఉపసంహారం:

ఇటీవల వచ్చిన హిట్‌ సినిమాలో ఒక పాత్రధారి.. ‘‘టెక్నాలజీలు పెరిగి చేతుల్లోకి ఫోన్లొచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలిగానీ.. ఇలా పెరిగిపోతోందేమిట్రా’’ అని ప్రశ్నిస్తే.. ‘‘తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్‌. దాన్ని వాడే మనుషుల్లోనే ఉంది’’ అంటాడు హీరో. నిజమే.. తప్పు మనలోనే ఉంది. దాన్ని సరిదిద్దుకోగలిగే తెలివీ మనలోనే ఉంది. 

Related Posts
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు మాలిన రాతలున్నై.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక లేఖ రాసింది. కొందరు నటులు డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మొత్తం ఇండస్ట్రీకే మచ్చ వస్తోంది.. ఇలా విచారించకండి అనేది సారాంశం. తెలుగు సినీ పరిశ్రమ 2000 కోట్లు దాటింది ...
READ MORE
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు
Facebook Comments
Top
error: Content is protected !!