
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. ఈ అక్షరాలు కాదు నిజాలు కళ్ల ముందు కదలాడిన నిజాలు. ప్రాణాలు గాల్లో పోతుంటే గుడ్ల గూబల్లా కళ్లు తెరిచి టెక్నాలజి మత్తులో చిత్తుగా జోగుతూ ఓ నిండు ప్రాణాన్ని గాల్లో కలిపిన మనసు లేని జంతువులకంటే అద్వాన్నమైన బతుకులు. అవును వీళ్లు మనుషులు కూడా కాదు ఆ రూపంలో ఉన్న రాక్షసులు. పరువు కోసం కులం కోసం నిండు ప్రాణాలను గాల్లో కలిపి పిశాచాల్లా ఆనందం పొందిన నర రూప రాక్షసులు. ఒక యువతి ప్రాణం పోతుంటే.. సాయం కోసం అల్లాడుతుంటే వందల కళ్లు అలా చూస్తూ ఉండిపోయాయి. ఆ యువతి నిస్సహాయతను ఆమె అనుభవిస్తున్న క్షోభను వీడియోలు తీస్తూ ఉండిపోయారు.
ఇంత హృదయ విదారక ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిగ్వ అటవి ప్రాంతంలో చోటు చేసుకుంది. నడి రోడ్డు పై రెండున్నర గంటల పాటు నరక యాతన అనుభవిస్తూ చుట్టూ వందల మంది ఉన్న కాపాడే నాథుడే కరువై ఈ ఆటవిక ప్రపంచంలో బ్రతకలేక జులై 21న ఆ యువతి కన్నుమూసింది. పరువు హత్య గా అంతా అనుకున్నారు. అది నిజమే కానీ ఇప్పుడు కనిపిస్తున్న అసలు దృశ్యాలు చూశాక అది పరువు హత్య మాత్రమే కాదు మానవత్వం మంటగలిసిన హత్య.. మనిషన్నవాడు చచ్చిపోయిన హత్య అని తేలిపోయింది.
ఛీ ఈ ప్రజలనా దేశం గర్వించే మనుషులని కీర్తిస్తోంది అంటూ పూజ తుది శ్వాస విడిచింది. ఇక తనకు ఈ మానవత్వం లేని మనుషులు ఏ సాయం చేయరని తెలిసుకుందేమో.. ఓపిక తెచ్చుకుని రోడ్డుపై అడ్డంగా పడుకుంది. గొంతులో కత్తి దిగి రక్తం కారుతున్నా అతి కష్టమ్మీద లేచి రోడ్డు పక్కన కూర్చుంది. అప్పటికీ ఆమెకు చుక్క నీళ్లిచ్చిన వారు కానీ.. అంబులెన్స్‌కి ఫోన్ చేసిన వాళ్లు కానీ కానరాలేదు. అంతా అలా చూస్తూ ఆమె చావును ఆస్వాదించారు. అప్పటికే ఆమె ప్రియుడు కొంత దూరంలో చచ్చిపోయి పడి ఉన్నాడు. రెండు గంటల నరక యాతన అనంతరం ఆమె తుదిశ్వాస విడిచింది. అప్పటి వరకూ ఆమె ప్రతి మూమెంట్‌ని సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ ఆనందించారు అక్కడి వారంతా. పది రోజుల తర్వాత ఈ వీడియోలు ఇప్పుడిలా బయటకు వచ్చాయి.
పది రోజుల క్రితం నిర్మల్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర కుబీర్ మండలం నిగ్వా గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. మహారాష్ట్ర భోకర్ తాలుకా కేర్బాన్ గ్రామంలో పక్క పక్క ఇళ్లలోనే ఉంటారు.. పూజ(21) గోవింద్(26). పూజ వడ్డెర కులానికి చెందిన యువతి.. గోవింద్ దళితుడు. ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆమె ప్రేమని ఒప్పుకోని పూజ తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. కానీ వారి ప్రేమ మాత్రం చావలేదు. పూజకు పెళ్లైన నెల తర్వాత ఇద్దరు కలిసి బతికేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆమె తల్లిదండ్రులు వారి కోసం గాలించారు. ఇంతలో పూజ తమ్ముడు దిగంబర్ ఆమె సెల్‌ఫోన్‌కు కాల్ చేశాడు. ఇద్దరూ తిరిగి వస్తే పెళ్లి చేస్తామని నమ్మించాడు.
అది నమ్మిన పూజ తాము నిగ్వా వైపు వెళుతున్నామని చెప్పింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న దిగంబర్ పూజ, గోవింద్‌లపై కత్తితో విరుచుకు పడ్డాడు. ఈ దాడిలో గోవింద్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పూజను ఏకంగా గొంతు కోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ పూజ రోడ్డుపై పడిపోయింది. ఆమె చనిపోయిందని భావించిన దిగంబర్ అక్కడి నుంచి పారిపోయాడు. అలా రోడ్డుపై పడి ఉన్న పూజ రెండు గంటల పాటు ప్రాణాల కోసం అల్లాడిపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెకు చిన్న సాయం కూడా అందించలేదు సరికదా ఆమె చనిపోతున్న తీరును ప్రతిక్షణం వీడియో తీసి ఆనందించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిని చంపేసింది కూడా మన మధ్య ఉన్న ఆ మానవత్వం లేని మనుషులే. ఇప్పుడు ఆ చెత్తగాళ్లే మళ్లీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. మానవత్వాన్ని చనిపోయే సంధర్బంలో చూపని అదే మనుషులు ఇప్పుడు లైకుల కోసం షేర్ల కోసం సోషల్ మీడియా మత్తు కోసం పూజ ప్రాణాలు గాల్లో ఎలా కలిశాయో చూపిస్తున్నారు. మారదు లోకం మారదు కాలం ఎవ్వడు మార్చాలని చూసినా నిప్పులతో కాల్చినా మారదు ఈ చెత్త సమాజం.
























