
తెలంగాణలో జిల్లాల పునర్ విభజన జరిగి నేటికి ఏడాది గడిచింది. ప్రజల చెంతకే పాలనను అందించాలన్న నిర్ణయంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా విభజించారు. ప్రజల చెంతకు సంక్షేమపథకాలు అందాలన్న నిర్ణయంతో కొత్త జిల్లాలను ఏర్పాడు చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. జిల్లా ఆవిర్బావ దినోత్సవం సంధర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘నాకు జన్మనిచ్చింది, పోరాడే బలమిచ్చింది సిద్దిపేటనే అంటూ కేసీఆర్ మాట్లాడారు. ఇంకా పలుకులు ఇచ్చి పదవులు ఇచ్చింది.. తెలంగాణను సాధించే ఆత్మశక్తినిచ్చింది సిద్దిపేటనే.. అంటూ అనర్గళంగా మాట్లాడారు కేసీఆర్. ఎల్లవేళల అండనిచ్చిన నా జన్మభూమి సిద్దిపేటకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా’ అంటూ కేసీఆర్ తెలిపారు.’చాలా సంతోషంగా ఉంది.. సిద్దిపేటలోనే భోజనం చేసి సిరిసిల్లకు పోమ్మని హరీష్ చెప్పిండు.. కానీ మిమ్మలందరినీ చూడగానే కడుపు నిండిపోయింది. భోజనం చేయాలన్న ఆలోచన కూడా రావడం లేదని అని చెప్పారు. సిద్దిపేట జిల్లా కావాలన్నది తన చిన్ననాటి ఆకాంక్షని, సిద్దిపేట జిల్లా కావాలని గతంలోనే అప్పటి సీఎం ఎన్టీఆర్ను కోరానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. హరీష్ రావు సైతం ముందు సిద్దిపేట జిల్లా వస్తే చాలని అనుకున్నారని ఇప్పుడు మాత్రం అన్ని తన జిల్లాకే ముందుగా కావాలని కోరుతున్నారని మేనల్లుడిని ఉద్దేశించి మాట్లాడారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట హరీష్ పాలనలో దూసుకుపోతుందని కితాబిచ్చారు. సిద్దిపేటను మరింత అభివృద్ది చేసుకునే దిశలో భాగంగా పలు హమీలను గుప్పించారు కేసీఆర్.