
ఇద్దరు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్యతల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒకరి మీద ఒకరు దాడికి దిగారు. ఒక డాక్టర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేకరించిన రక్తాన్ని మరో డాక్టర్ కు ఎక్కించే ప్రయత్నం చేశాడు. తృటిలో తప్పిపోయింది కానీ లేకుంటే ఒంట్లోకి హెచ్.ఐ.వి రక్తం వెళ్లి జీవితం నాశనం అయ్యేది. ఒక ప్రాణాన్ని నిలబెట్టాల్సిన వైద్యులే ఇలాంటి ఘోరానికి పాల్సడటంతో అక్కడి రోగులంతా షాక్ అయ్యారు. ఇదెక్కడో పరాయి దేశంలోనే జరగలేదు. తెలుగ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనే చోటు చేసుకుంది ఈ ఘోరం. కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీప్రసాద్పై ఇదే ఆసుపత్రిలోని ఎముకల వైద్యుడు డాక్టర్ డేవిడ్రాజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విధులకు సక్రమంగా హాజరవుతున్నా ప్రశ్నిస్తున్నారంటూ ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డడంటా. సిబ్బంది తన మాట వినటం లేదని. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని.. తను చికిత్స అందిస్తున్న రోగిని.. తనకు తెలియకుండానే డిశ్ఛార్జి చేశారంటూ సూపరింటెండ్ పై ఈ చర్యకు పాల్పడ్డాడంటా. ఇంకా ఆ డాక్టర్ బాజప్తాగా ఒప్పుకోవడం ఇక్కడ విశేషం. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఓ హెచ్ఐవీ రోగి ఇచ్చిన సూది గుచ్చుకోవడంతో తనకు కూడా హెచ్ఐవీ సోకుతుందేమోనని ఆందోళన చెందానని తెలిపాడు. బైపాస్ సర్జరీ కారణంగానే తాను నిత్యం ఎంతో ఇబ్బంది పడుతున్నానని, ఈ బాధ తెలియాలనే ఉద్దేశంతోనే హెచ్ఐవీ సిరంజీతో సూపరింటెండెంట్ పై దాడికి యత్నించినట్లు డేవిడ్ రాజు తెలిపారు. ఈ ఘటనపై డీసీహెచ్ఎస్ డాక్టర్ జయరాజన్ విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. డేవిడ్రాజును దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ఇదే ఆసుపత్రిలోని హెచ్ఐవీ వార్డులో ఉన్న ఓ రోగి నుంచి డేవిడ్రాజు అనుమతి లేకుండా సిరంజితో రక్తం సేకరించినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డేవిడ్ రాజుపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.