
క్రికెటర్ల నుంచీ సినిమా యాక్టర్ల వరకూ ఎవర్నీ సోషల్ మీడియా ట్రాల్స్ (కొంటె విమర్శలు) వదలడం లేదు. ఏదన్నా సంఘటన జరిగితే ట్రాల్స్ రూపంలో కామెంట్లు వెల్లువెత్తున్నాయి. ఈ మధ్యనే తాప్సీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె తాజాగా నటించి ‘జుడ్వా-2’ సినిమాలో ‘ఆ తో సహీ’ పాట కోసం బికినీ ధరించింది. దానికి సంబంధించిన బికినీ స్టిల్స్‌ను ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతే ట్రాల్స్ రూపంలో విమర్శలు, వాదనలు మొదలయ్యాయి. కొందరు తాప్సీని తిడుతూ ట్వీట్లు చేశారు. సొట్టబుగ్గల సుందరి కూడా ట్వీట్‌కి ట్వీట్ అన్నట్టు ఘాటుగానే సమాధానాలిచ్చింది. ‘ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్! నీ సోదరుడు నిన్ను చూసి ఎంత గర్వపడుతున్నాడో…’ అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే… ‘సారీ! నాకు సోదరుడు లేడు. లేదంటే అడిగి చెప్పేదానిని. ఇప్పటికి ఈ సోదరి ఇచ్చిన జవాబు సరిపోతుందా?’ అని ప్రశ్నిం చింది. ‘ఇలాంటి చెత్త ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి యువతను పాడు చేస్తున్నారు’ అని మరో వ్యక్తి చేసిన ట్వీట్‌కు ‘‘చెత్తా..! నా శరీరానికి అంటుకున్న ఇసుకను శుభ్రం చేసుకోవలసింది. అంతగా అబ్జర్వ్ చెయ్యలేదు. అందుకు క్షమించండి. ఈసారి జాగ్రత్తగా ఉంటాలే!’ అని కౌంటర్ వేసింది. కొందరు తాప్సీకి సపోర్ట్‌గా మాట్లాడితే మరి కొందరు ట్వీట్ల యుద్దం కొనసాగిస్తూనే ఉన్నారు.